ఆఖరి కోరిక
నేను .....
ఆడపిల్లను..
అమ్మ ఒడిలో నాడు
లోకంలో తేడాలు తెలీదు
అందుకే
అవని అమృతమయి అనుకున్న
ఆనంద డోలికలో అడమరిచా.
పసిదానిని......
తప్పటడుగులు వేశాను
అదుపులేక పడ్డాను
"చిన్ని అడుగులు వేయవే తల్లి",
అంది అమ్మ;
"జారిపడితే నిన్నెవరు చేసుకుంటారు?
అన్నాడు నాన్న.
అప్పుడే మొదలు
ముందడుగు వేయాలంటే అదురు
జీవితము నాది కాదేమోనన్న బెదురు!
పిల్లదాన్ని....
ప్రపంచములో భాగాన్ని
పాఠంలే నేర్చి ప్రతిభ చాటలనుకున్నా
"ఆడపిల్లకు అణుకువే అందం",
అన్నాడు నాన్న
"ఇది వారి ప్రపంచమే",
నిట్టూర్చింది అమ్మ.
అర్థం కాకున్నా అయ్య మాట
ఆఖరి మాట అయింది
నా జీవతాన్నినిర్దేశించేది
నేను కాదని అవగతమయింది.
వయస్సు పిల్లను........
ఊహల్లో తేలాను
నా జతగాడితో క్రాంతి పథంలోకి
అడుగు పెడతాననుకున్న
నన్నో అయ్య చేతిలో పెట్టాడు మా అయ్య
ఇక నా లోకం ఆయనే అన్నాడు
మతిలేని శ్రీమతినై నేను
ఆయన పాలనలో
పిల్లలు కనే మనిషినైన
నన్నే మరచిపోయిన.
ముసలిదాన్ని.........
బతకటం మరచినదాన్ని
అలవాటుగా బతికేస్తున్న దాన్ని
నేను కన్నయ్య
నన్ను ఇంటి దైవమంటాడు
వయ్యసులో వాళ్ళు ఊళ్లు తిరిగొస్తారు
ముసలివాళ్ళు ఇంటి ముంగిట ఉండాలంటాడు
చేతకానిదాన్ని చెప్పింది వింటాను.
కాటికి కాళ్ళు చాచుకున్న
చావని ఆశ
విశ్వ సృష్టి స్థితి లయలో
నాది కూడ సమున్నత స్థానం కావాలని
కాష్టంలో కలసిన నాడైనా
జ్వాలనై వెలుగులు జిమ్ముతూ
ఆకాశాన్ని అందుకోవాలని
బూడిదనై
పృథ్విలో పరమాణువుగ మిగలాలని .
No comments:
Post a Comment